

ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం ప్రారంభించింది. అక్టోబర్ 24, 2026న నగరంలోని వివిధ ప్రాంతాల్లో సౌండ్ బాక్సుల ద్వారా చాటింపు వేస్తూ నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించింది. హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కార్లు, బైకులు కడిగేందుకు నీటిని వృథా చేయడం, ఇంటి ముందు అవసరం లేకుండా నీటిని పారబోయడం వంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తగినంత వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు కూడా తగ్గుతున్నాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లోనూ నీటి నిల్వలు తగ్గుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘సేవ్ వాటర్’ కార్యక్రమంలో భాగంగా జలమండలి ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అవసరమైనంత నీటినే ఉపయోగించడం, వృథాను అరికట్టడం, నీటి వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!