

హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్లు, ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో లగ్జరీ హైరైజ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణం పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిని కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు ప్రీమియం సదుపాయాలను అందిస్తున్నారు. వీటిలో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ ప్రధాన ఆకర్షణగా మారుతోంది. అయితే, ఈ సదుపాయం కోసం కొన్ని ప్రీమియం ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు సుమారు రూ.400 అదనంగా వసూలు చేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లాట్ విస్తీర్ణం పెరిగే కొద్దీ ఈ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, 3,000 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేసే వ్యక్తి సెంట్రలైజ్డ్ ఏసీ కోసమే రూ.12 లక్షలు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. దీంతో ఫ్లాట్ అసలు ధరకు అదనంగా కొనుగోలుదారుడి బడ్జెట్ పెరుగుతుంది.
సెంట్రలైజ్డ్ ఏసీ ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతను సమర్థంగా నియంత్రించవచ్చని, విడివిడిగా ఏసీ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం తగ్గుతుందని, ఇంటీరియర్ రూపం కూడా మెరుగ్గా ఉంటుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలోనే వీఆర్‌వీ లేదా వీఆర్‌ఎఫ్ వ్యవస్థలు, కూలింగ్ పైప్‌లైన్లు, సెంట్రల్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చుల కారణంగా ఈ ఛార్జీలు విధిస్తున్నామని బిల్డర్లు సమర్థించుకుంటున్నారు. అయితే, కొనుగోలు సమయంలో చెల్లించే మొత్తంతోనే ఖర్చు ముగిసిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ వినియోగం, క్రమం తప్పకుండా చేయాల్సిన సర్వీసింగ్, నిర్వహణ ఖర్చులు భవిష్యత్తులో నెలవారీ మెయింటెనెన్స్ బిల్లులను పెంచవచ్చు. అందువల్ల లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు అదనపు సదుపాయాల ఛార్జీలు, వాటి నిర్వహణ వ్యయాలు, తప్పనిసరిగా చెల్లించాల్సిన రుసుముల వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!