

తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ సోమవారం చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అందుబాటులో ఉన్న వర్షపాత వివరాల ప్రకారం, ప్యారిస్‌లో అత్యధికంగా 36 సెంటీమీటర్లు, కత్తివాక్కంలో 34 సెంటీమీటర్లు, చెన్నై సెంట్రల్‌లో 27 సెంటీమీటర్లు, సాత్తాంకాడులో 26 సెంటీమీటర్లు, తిరువొట్రియూర్, ఎన్నూర్‌లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎంజీఆర్ నగర్‌లో 19 సెంటీమీటర్లు, తండయార్‌పేటలోని సీడీ ఆస్పత్రి ప్రాంతం, పెరంబూర్‌లో 18 సెంటీమీటర్లు, తండయార్‌పేటలో 17 సెంటీమీటర్లు నమోదయ్యాయి. వడపళని, చెన్నై కలెక్టరేట్ ప్రాంతాల్లో 16 సెంటీమీటర్లు, బేసిన్ బ్రిడ్జ్, నుంగంబాక్కం, వైఎంసీఏ నందనం, ఆలందూర్‌లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మణలి, మడిప్పాక్కం, సాలిగ్రామం, వలసరవాక్కం, రెడ్‌హిల్స్, గుమ్మిడిపూండి సహా పలు ప్రాంతాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!