

తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు రెండు పోటీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 6న జరగనున్న టీజీపీఎస్సీ ఏఈ (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అదే తేదీన ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష కూడా ఉండటంతో వేలాది మంది తెలంగాణ అభ్యర్థులు రెండు పరీక్షల్లో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష రాసే అభ్యర్థులు తిరిగి తెలంగాణకు వచ్చి ఏఈ పరీక్షకు హాజరుకావడం కూడా కష్టమని లేఖలో వివరించారు.
పరీక్షల తేదీలను మార్చాలని అభ్యర్థులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ స్పందించలేదని హరీశ్ రావు ఆరోపించారు. అక్టోబర్ 14న పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా టీజీపీఎస్సీ కి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలను మార్చినప్పుడు తెలంగాణలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోరుతున్నది పరీక్షలను రద్దు చేయడం కాదని, రెండు పరీక్షలూ రాసే అవకాశం కల్పించడమేనని తెలిపారు. సీఎం వెంటనే జోక్యం చేసుకుని ఏఈ పరీక్షను వాయిదా వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, టీజీపీఎస్సీ ముందస్తు చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!