

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదో రోజైన గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిజ ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా పూజలందుకునే అమ్మవారు భక్తులను కరుణిస్తారని భక్తుల విశ్వాసం. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలందిస్తుండగా, చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశం ధరించి ఎరుపు, నీలం రంగుల చీరల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజున రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లం గారెలతో పాటు పది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల్లో ఈ అలంకారానికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!