

గూగుల్ డెవలపర్ గ్రూప్ (జీడీజీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవ్‌ఫెస్ట్–2026 విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్‌లో జరిగిన ఈ సదస్సుకు 3,000 మందికి పైగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ–ఎంఎల్), క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవ్‌ఆప్స్, మొబైల్ టెక్నాలజీ అంశాలపై నాలుగు ప్రత్యేక విభాగాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. 30 మందికి పైగా పరిశ్రమ నిపుణులు సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవాలు, నూతన ఆవిష్కరణలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రీ-ఏజీఐ ఏఐ అవతార్‌ను ఆవిష్కరించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ నాయకత్వంతో ప్రజలు ఏఐ సాంకేతికత ద్వారా పరస్పరం సంభాషించేందుకు వీలుగా ఈ అవతార్‌ను రూపొందించారు. టెన్సర్‌గో అభివృద్ధి చేసిన హ్యూమ్‌ఏఐఎన్ (HumAIn) ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌ను ఇందుకు ఉపయోగించారు.
‘ఇన్నోవేషన్ ఎట్ స్కేల్’ అంశంపై ప్రసంగించిన మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దడంలో యువ ఆవిష్కర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘బిల్డ్, సెక్యూర్, స్కేల్: డెవలపర్స్ అండ్ బిల్డర్స్ ఇన్ ది ఏజెంటిక్ ఎరా’ ఇతివృత్తంతో సాగిన ఈ సదస్సులో ప్రత్యక్ష కోడింగ్, సాంకేతిక ప్రదర్శనలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. రీ-రైటబుల్ ఎన్‌ఎఫ్‌సీ స్మార్ట్ బ్యాడ్జీల ద్వారా ఉద్యోగార్థులు తమ డిజిటల్ రెజ్యూమెలను నియామక సంస్థలకు అందించే సదుపాయాన్ని కల్పించారు. గూగుల్ ఫర్ డెవలపర్స్, లాజిటెక్, లిరిక్ ఏఐ, మెట్లైఫ్, ఎంఎస్‌ఐ వంటి సంస్థలు సాంకేతిక ప్రదర్శనలు, నియామక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హాజరైన వారికి పునర్వినియోగించగల వాటర్ బాటిళ్లను అందించారు. గత 13 ఏళ్లుగా సాంకేతిక సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న జీడీజీ హైదరాబాద్ ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా టెక్నాలజీ ఆసక్తిగల వ్యక్తులతో అనుసంధానమై, 20,000 మంది డెవలపర్ల క్రియాశీల కమ్యూనిటీని కొనసాగిస్తోంది. యువతకు సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమలతో అనుసంధానం, ఉద్యోగ అవకాశాలు అందించడంలో దేవ్‌ఫెస్ట్–2026 కీలక వేదికగా నిలిచింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!