

ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. పారిస్‌లో సుమారు 350 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. పారిస్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో జరిగిన ఆందోళనలను అదుపు చేయడంలో భద్రతా బలగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని హోంమంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు. నిరసనల్లో పాల్గొంటారని తొలుత సుమారు రెండు లక్షల మందిని అంచనా వేయగా, ఆ సంఖ్య ఐదు లక్షలు దాటిందని పేర్కొన్నారు. హింసను నియంత్రించడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా సమర్పించినప్పటికీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దానిని తిరస్కరించినట్లు ఎలిసీ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. నిరసనకారులు సుమారు 1,500 దుకాణాలు, వ్యాపార కేంద్రాలను ధ్వంసం చేసి, లూటీకి పాల్పడినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల కొరత, పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం అధికమవడం వంటి సమస్యలపై కొంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలకు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వివిధ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. తొలుత శాంతియుతంగా సాగిన నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. పారిస్, లియోన్, మార్సెయి నగరాల్లో భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని స్థానిక మేయర్లు విమర్శించారు. నిరసనల వెనుక విద్యా వ్యవస్థ సమస్యలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మేలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు ఫ్రాన్స్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!