

భారత్ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాకిస్థాన్ ఇబ్బందులు పడుతోందనే అభిప్రాయాలకు ఆ దేశ మాజీ సైనిక అధికారి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్థాన్ జాతీయ కమాండ్ అథారిటీ సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ మజహర్ జమీల్.. లండన్‌లోని అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థలో చేసిన ప్రసంగం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో అస్థిరత సృష్టించేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), బలోచిస్థాన్ విముక్తి సైన్యం (బీఎల్‌ఏ) వంటి సంస్థలకు భారత్ మద్దతు ఇస్తోందని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వ్యూహాల ద్వారా పాకిస్థాన్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్‌టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చిందని, 2001 నుంచి 2014 మధ్య అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఆరు దౌత్య కార్యాలయాలను నిర్వహించిందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు మద్దతుగా స్వతంత్రంగా ధ్రువీకరించిన ఆధారాలు ప్రసంగ వివరాల్లో లేవు.
గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ అణ్వాయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని మజహర్ జమీల్ ఆరోపించారు. భారత్ అనుసరిస్తున్న ‘ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించకూడదు’ అనే విధానం కేవలం దౌత్య వ్యూహమని, అవసరమైతే ముందుగా దాడి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని వాదించారు. ఆపరేషన్ సిందూర్‌తో దక్షిణాసియా అణు సంక్షోభం అంచుకు చేరిందని, పాకిస్థాన్ సంయమనం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద భారత్‌కు కల్పించిన మినహాయింపులను తొలగించాలని కోరినట్లు సమాచారం. భారత్‌పై చేసిన ఈ ఆరోపణలు, అణ్వాయుధ విధానంపై ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయ భద్రత, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!