

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన కేంద్ర నిధుల విడుదల, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, సంక్షేమం, హోం, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, రవాణా, పశుసంవర్థక శాఖల అధికారులు నిధుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆలస్యం కాకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స, ఆర్థిక సహాయం అందించే ‘పీఎం రాహత్’ పథకంలో రాష్ట్రంలోని మరిన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులను నమోదు చేయించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ పథకంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ప్రమాద బాధితులను కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో సమీప ఆస్పత్రికి చేరిస్తే పథకం కింద రూ.1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని వివరించారు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యికి పైగా ఆస్పత్రులు నమోదై ఉండగా, పీఎం రాహత్‌లో ఇప్పటివరకు 469 ఆస్పత్రులు మాత్రమే చేరాయని తెలిపారు. ఈ సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!