

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. యాసంగి సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాయితీపై విత్తనాల పంపిణీకి రూ.224 కోట్లు, ఉద్యాన పంటల ప్రోత్సాహం, విస్తరణకు రూ.296.88 కోట్లు అవసరమని శాఖ సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
వానాకాలంలో వర్షాభావం కారణంగా విత్తనాలు వేయడంలో ఆలస్యం, నేలలో తేమ తగ్గడం, మొక్కల పెరుగుదల మందగించడం, దిగుబడులు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నివేదిక హెచ్చరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాలని సూచించింది. నీటి పొదుపు కోసం మల్చింగ్, వ్యవసాయ కుంటలు, వర్షపు నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. రైతు మేళాలు, గ్రామసభల ద్వారా ఎల్‌నినో ప్రభావంపై చైతన్యం తీసుకురావాలని ప్రతిపాదించారు. భూగర్భ జలాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయ చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే వర్షపాతం లోటు నమోదవుతున్న ప్రాంతాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమించారు. సబ్సిడీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక సలహాలు సకాలంలో అందితే రైతుల నష్టాలను తగ్గించడంతో పాటు నీటి వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!