

ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో వ్యవసాయ సీజన్కు వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పంటలు ఎండిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్తు కోతలు ఉండకూడదని, సరఫరాలో అంతరాయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఐఏఎస్ అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావాన్ని కొవిడ్ తరహా సంక్షోభంగా అభివర్ణించిన సీఎం.. జూన్ వరకు అమలు చేసేలా పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధిభవన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్తు ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై చర్చించారు. విద్యుత్తు అంతరాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. విద్యుత్తు సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఎల్నినో ప్రభావంతో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 స్థాయి అధికారులను నియమించి, వర్షాభావం, విద్యుత్తు, తాగునీరు, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలపై నిరంతరం నివేదికలు సేకరించాలని సూచించారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని తెలిపారు. గ్రామసభలు, కళాజాతాల ద్వారా ఎల్నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశాన్ని కూడా సీఎం పరిశీలించినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!