

చల్లని వాతావరణానికి పేరుగాంచిన ఐరోపా ఖండాన్ని ఈ ఏడాది వేసవి తీవ్ర ఉష్ణోగ్రతలు వణికించాయి. ఎల్‌నినో పరిస్థితులకు వాతావరణ మార్పులు తోడవడంతో అనేక దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో 854 నగరాల్లో వడగాలుల కారణంగా 50,391 మంది మరణించినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో 32,619 మరణాలకు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలు కారణమని పరిశోధకులు అంచనా వేశారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ‘నేచర్ హెల్త్’ జర్నల్‌లో త్వరలో ప్రచురితం కానున్నాయి. 2022 వేసవిలో నమోదైన 29,480 మరణాలతో పోలిస్తే ఈసారి మరణాల సంఖ్య 71 శాతం పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
ఈ ఏడాది ఫ్రాన్స్‌లో గరిష్ఠంగా 43.8 డిగ్రీల సెల్సియస్, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్ 17 నుంచి జులై 1 మధ్య తీవ్రంగా వీచిన వడగాలుల సమయంలోనే వేసవి మరణాల్లో మూడో వంతు సంభవించినట్లు పరిశోధకులు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో సగానికి పైగా 85 ఏళ్లు దాటినవారే కాగా, 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్నవారు సుమారు 800 మంది ఉన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమర్థమైన చర్యలు తీసుకోకపోవడం ఇటువంటి తీవ్ర పరిణామాలకు కారణమవుతోందని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!