

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న దిల్లీలో మెగా ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, దీపావళి పండగ సీజన్లో ర్యాలీ కారణంగా వ్యాపారాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ, కార్యక్రమాన్ని వాయిదా వేయాలని దిల్లీ వ్యాపార సంఘాలు కోరాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, వ్యాపార సంఘాల విజ్ఞప్తిపై పార్టీ నాయకత్వం చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన తీవ్రమైన అంశమని, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకే ఈ ఆందోళన చేపడుతున్నామని ఆయన వివరించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దిల్లీలోని రామ్లీలా మైదానం వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఇందులో సుమారు 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ర్యాలీ వల్ల ట్రాఫిక్ ఆంక్షలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడి దీపావళి వ్యాపారాలు దెబ్బతినవచ్చని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఒక్కరోజే రూ.3,000 కోట్ల వరకు వ్యాపార నష్టం సంభవించవచ్చని పేర్కొంటూ, ర్యాలీని నవంబర్ 10 వరకు వాయిదా వేయాలని కోరింది. ఈ మేరకు సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రామ్లీలా మైదానం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో చాందినీ చౌక్, సదర్ బజార్, చావ్రీ బజార్, కరోల్ బాగ్ వంటి ప్రధాన హోల్సేల్, రిటైల్ మార్కెట్లు ఉండటంతో పండగ సీజన్లో వ్యాపారుల ఆందోళన పెరిగింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!