

తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం, రేషన్ బియ్యం వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సుమారు 42 వేల క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం లేదా రేషన్ బియ్యం మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అలాగే సిద్దిపేట జిల్లా మోతెలోని భారతి ఇండస్ట్రీస్లోనూ తనిఖీలు చేపట్టి, ధాన్యం నిల్వలు, రికార్డులు, బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలను పరిశీలించారు.
ప్రభుత్వానికి చెందాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి భారతి ఇండస్ట్రీస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం పరారీలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో, సీఎంఆర్ ధాన్యం సేకరణ, మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగించే ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న అక్రమాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మాయమైనట్లు చెబుతున్న ధాన్యం, బియ్యం పరిమాణం, బాధ్యులపై తదుపరి చర్యలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!