

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు అది తుపానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులతో సమావేశమైన సీఎం, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం, తాజా సమాచారం కోసం ప్రజలు సంప్రదించేందుకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. తుపాను ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు, సమయానుకూల సమాచార వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!