

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులతో జరిపిన సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే, ఐటీ రంగాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జరిపిన భేటీలో పలు కీలక హామీలు, ఆమోదాలు లభించాయి. రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలకమైన సెమీకండక్టర్ డిజైన్, ఏఐ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ డిజైన్, తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడం.
రెండోది, రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఈ రెండు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D), నైపుణ్య శిక్షణ, సామర్థ్యాల పెంపునకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ద్వారా అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే, కృత్రిమ మేధ (AI) అభివృద్ధి, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!