

అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి, రవాణా, అన్నప్రసాదం, పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు తిరుపతి నగరంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. భక్తులకు అవసరమైన సమాచారం, సేవలను అందించేందుకు వెంకటాద్రి యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, పాలక మండలి సభ్యులు, తిరుపతి జిల్లా అధికారులు, తుడా ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
అలిపిరి వద్ద రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో 2,700 గదులతో వసతి సముదాయాలను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. రూ.160 కోట్లతో నిర్మించే అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లను నిర్మించి, ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మించనున్నారు. వీటితో పాటు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం 418 ఎకరాల్లో 5,192 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించే నివాస లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయనుండగా, వాటిలో మూడు రహదారులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!