

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగర మేయర్ కార్యాలయం, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం, ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంఝ్ సంగీత కచేరీ వేదికపై దాడులు చేస్తామంటూ శుక్రవారం ఓ ఈ-మెయిల్ రావడంతో పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మేయర్ రీతూ తావ్డేకు ఈ సందేశం అందినట్లు అధికారులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, ఈ-మెయిల్ విశ్వసనీయతపై దర్యాప్తు ప్రారంభించారు.
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ-మెయిల్‌ను డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి కూడా పంపినట్లు సమాచారం. నవంబరు 27న మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరగనున్న దిల్జీత్ దోసాంఝ్ సంగీత కచేరీపై దాడి చేస్తామని సందేశంలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, అమితాబ్ బచ్చన్ జుహూలో నివసించే ‘జల్సా’ ఇంటిని అక్టోబరు 31 నుంచి నవంబరు 27 మధ్య లక్ష్యంగా చేసుకుంటామని, ఈ నెల 31న ఓ పాఠశాలపై గ్రనేడ్ దాడి చేస్తామని కూడా హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. సందేశంలో ‘ఖలిస్థాన్’ ప్రస్తావన ఉన్నట్లు పేర్కొన్నారు. మేయర్ కార్యాలయం, రేస్‌కోర్స్, ప్రముఖ విద్యాసంస్థలు సహా బెదిరింపుల్లో ప్రస్తావించిన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, అందులోని హెచ్చరికలకు విశ్వసనీయత ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!