

ముంబై మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపుతో కూడిన ఈమెయిల్ రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మేయర్ రీతూ తావ్డేకు పంపిన సందేశంలో కార్యాలయం వద్ద పేలుడు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులేవీ గుర్తించలేదని సమాచారం. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి కూడా బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాయకుడు దిల్జీత్ దోసాంజి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా బెదిరింపు సందేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. అక్టోబర్ 31న ఓ పాఠశాలపై గ్రెనేడ్ దాడి చేస్తామని, జూహూలోని అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’పై అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య దాడి చేస్తామని హెచ్చరించినట్లు నివేదికలు వెల్లడించాయి. నవంబర్ 27న మహాలక్ష్మి రేస్కోర్స్ ప్రాంతంలో జరగనున్న దిల్జీత్ దోసాంజి కచేరీని లక్ష్యంగా చేసుకుంటామని సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను, సందేశాలు పంపిన మూలాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపుల విశ్వసనీయతపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!