

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం బాంబు బెదిరింపు నేపథ్యంలో బల్గేరియా రాజధాని సోఫియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రొమేనియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందికి బెదిరింపు సమాచారం అందడంతో అప్రమత్తమై విమానాన్ని సోఫియా వైపు మళ్లించారు. బల్గేరియా వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం సైతం విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చి, సురక్షితంగా ల్యాండింగ్ అయ్యే వరకు పర్యవేక్షించింది. విమానం దిగిన అనంతరం అందులోని 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని బయటకు తరలించి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ఈ ఘటన గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కారణంగా చోటుచేసుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. విమానంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తినట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ యువ ప్రతినిధుల బృందం కూడా విమానంలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, బాంబు బెదిరింపుపై ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఫ్లై దుబాయ్ విమానంలోనూ ఇలాంటి భద్రతాపరమైన ఆందోళన తలెత్తినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!