

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ హింసాత్మక పాలన సాగిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన, పారదర్శకత కొరవడ్డాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, భౌతిక దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించేయడం, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు, రాయచోటి, ప్రొద్దుటూరు, పుంగనూరు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు జరిగాయని, నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపిస్తూ ఈ ఘటనలను పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. మంత్రులే నామినేషన్ కేంద్రాల వద్ద ఉండి హెచ్చరికలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యం ఎవరి సొత్తూ కాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను అణచివేయడం, అభ్యర్థుల హక్కులను హరించడం, ప్రశ్నించే గొంతులను భయపెట్టడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నించిన చోట ఎన్నికలను నిలిపివేసి, అభ్యర్థులకు మళ్లీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!