

యెమెన్‌లో భారతీయులు ప్రయాణిస్తున్న పడవపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. హోడెడా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ పడవలో 14 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 22న భారత పౌరులు ఉన్న విలాసవంతమైన పడవపై సౌదీ అరేబియా దాడి చేసిందని హూతీలు ఆరోపించారు. జబల్ జుకర్ ద్వీపం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు, పడవలోని వారిని యెమెన్ సైన్యం రక్షించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై తొలుత స్పందించిన భారత రాయబార కార్యాలయం.. విహార నౌకలో భారతీయ నావికులు ఉన్నట్లు తెలిసిందని, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారి గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదని తెలిపింది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే, పడవపై దాడి చేసింది ఎవరనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతర్జాతీయ సముద్ర రవాణాలో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తుండగా, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నౌకలపై దాడులు వారి భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!