

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 14వ తేదీ బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అదే రోజు పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం ఉదయం 11:30 గంటలకు 20 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
పంచాయతీ, పురపాలక, ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించి, నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతాయి. పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించి, 15 రోజుల్లో ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించి, 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పురపాలక, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,05,432 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!