

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ భేటీలో 48 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించింది. ఇప్పటివరకు రూ.4,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బాధితులకు పరిహారం అందించేందుకు వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నష్టం అంచనా నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.
సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తుఫాన్ ప్రభావంతో ఉప్పాడలో 40 బోట్లు, కోనసీమ జిల్లా తీర ప్రాంతంలో ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు దెబ్బతిన్నాయని వివరించారు. యు.కొత్తపల్లి మండల మత్స్యకారుల బోట్లకు కూడా నష్టం వాటిల్లిందని, బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం అందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో బోట్లు, వలలు, ఇతర చేపల వేట సామగ్రిని కోల్పోయిన మత్స్యకారులందరికీ సత్వర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణలో చంద్రబాబు పనితీరు ప్రశంసనీయమని పవన్ కల్యాణ్ కొనియాడారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!