

విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎయిర్‌ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అక్టోబర్ 24న ఎక్స్ వేదికగా స్పందించిన సంస్థ.. చెన్నై విమానాశ్రయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై వ్యాట్‌ను 29 శాతం నుంచి 16 శాతానికి, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో 1 శాతానికి తగ్గించడాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని పేర్కొంది. తమ విమాన సర్వీసుల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి, తమిళనాడు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది.
విమాన ఇంధనంపై అధిక పన్నుల కారణంగా విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న వ్యయ భారాన్ని తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 23న కొత్త పన్ను రేట్లను ప్రకటించింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, సవరించిన రేట్లు 2026 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2027 అక్టోబర్ 31 వరకు కొనసాగనున్నాయి. ఈ విధానం ప్రకారం చెన్నై విమానాశ్రయంలో ఇంధనం నింపుకునే షెడ్యూల్డ్ విమానయాన సంస్థలకు 16 శాతం వ్యాట్ వర్తించనుండగా, కోయంబత్తూరు, మదురై, తిరుచిరాపల్లి వంటి ఇతర విమానాశ్రయాల్లో 1 శాతం పన్ను వర్తించనుంది. ఈ తగ్గింపు ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణకు తోడ్పడవచ్చని భావిస్తున్నారు. అయితే, విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా లేదా అనేది ఆయా సంస్థల ధరల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!