

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వివిధ గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, వైద్యపరంగా అర్హత ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మవద్దని తెలిపారు. రిమ్స్ రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రక్తదానం ద్వారా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడమే కాకుండా, మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!