

అల్ట్రావయోలెట్ కంపెనీ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్-47 వీనమ్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించింది. అయితే తొలి 5,000 యూనిట్లను ప్రత్యేక ఆఫర్ కింద రూ.2.65 లక్షలకు విక్రయించనుంది. అక్టోబర్ 22 నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ నుంచి మొదలుకానున్నాయి. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన వీఎక్స్-100 100వీ ఆర్కిటెక్చర్‌పై ఈ మోటార్‌సైకిల్‌ను రూపొందించారు. దీని బరువు 180 కిలోలు. కొత్త బ్యాటరీ ప్యాక్ మునుపటి దానికంటే 15 శాతం తేలికగా ఉండటంతో పాటు 25 శాతం అధిక సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, పాత రేడియల్ కూలింగ్ సెటప్ స్థానంలో యాక్సియల్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది రెట్టింపు శీతలీకరణ పనితీరును అందిస్తుందని సంస్థ వెల్లడించింది.
ఎక్స్-47 వీనమ్‌లో 11 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 343 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ కేవలం 2.7 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని, 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. దీని గరిష్ఠ వేగం గంటకు 155 కిలోమీటర్లు. 7 kWh బ్యాటరీతో ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను కూడా అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. భద్రత కోసం బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ ఛేంజ్ అసిస్టెన్స్, ఓవర్‌టేక్ అలర్ట్‌లు, వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాన్ని ముందుగా గుర్తించే హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వెనుకవైపు ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పుడు హజార్డ్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఇంటర్‌ఫేస్ ఎక్స్ సిస్టమ్‌తో పనిచేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇందులో ఆన్‌బోర్డ్ మ్యాప్ నావిగేషన్, వెనుక కెమెరా ఆధారిత పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్-47 వీనమ్ ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, టర్బో రెడ్, కాస్మిక్ బ్లాక్, స్టెల్లార్ వైట్ అనే నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీనికి 8,00,000 కిలోమీటర్ల వరకు పొడిగించగల వారంటీ కవరేజీని కూడా కంపెనీ ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హత వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. గరిష్ఠంగా 343 కిలోమీటర్ల రేంజ్, వేగవంతమైన యాక్సిలరేషన్, ఆధునిక భద్రతా సాంకేతికతలతో ఎక్స్-47 వీనమ్ భారత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లో కొత్త ఎంపికగా నిలవనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!