

దేశ ఆర్థిక వ్యవస్థకు భారత ఆల్కహాల్ పానీయాల పరిశ్రమ గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఇస్వాయ్) నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.4 లక్షల కోట్ల పన్నుల ఆదాయం సమకూరింది. ఇది దేశ మొత్తం పన్నుల వసూళ్లలో దాదాపు 6.6 శాతానికి సమానం. రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయంలో మద్యం వాటా విషయంలో తెలంగాణ 32 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు 27 శాతంతో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 25 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయంలో మద్యం వాటా సగటున 19.1 శాతంగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.40 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ పన్నుల ఆదాయం గణనీయంగా పెరిగింది.
క్యాలెండర్ సంవత్సరం 2025 నాటికి ఆల్కహాల్ పానీయాల పరిశ్రమ మార్కెట్ పరిమాణం రూ.6.20 లక్షల కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇది దేశ నామమాత్ర జీడీపీలో సుమారు 1.8 శాతానికి సమానం. వ్యవసాయం, తయారీ, ప్యాకేజింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి అనుబంధ రంగాల్లోనూ ఈ పరిశ్రమ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అయితే, ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యంపై అధికంగా ఆధారపడటం ఆందోళనకరమని ఇస్వాయ్ సీఈఓ సంజిత్ పాధి అభిప్రాయపడ్డారు. మరోవైపు, పన్నుల ఆదాయంలో తెలంగాణ ముందున్నప్పటికీ, అమ్మకాల పరంగా కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, కర్ణాటకలో 6.88 కోట్ల కేసులు, తమిళనాడులో 6.44–6.47 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. తెలంగాణలో 3.71 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 3.55 కోట్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!