

డబ్బు ఖర్చు, పొదుపు, నిర్వహణ వంటి అంశాలను ఎక్కువగా మనం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచే నేర్చుకుంటాం. భద్రత, సామాజిక ఆమోదం ఉన్నాయన్న భావనతో పెద్దలు చెప్పిన ఆర్థిక నియమాలను యథాతథంగా అనుసరిస్తుంటాం. అయితే కాలంతో పాటు జీవనశైలి, మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక అవసరాలు వేగంగా మారుతున్నాయి. అందుకే నాటి సలహాలు నేటికీ ఉపయోగకరమా కాదా అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
డబ్బు భద్రంగా ఉండాలంటే సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలన్నది పెద్దల సాధారణ సలహా. భద్రత ఉన్నప్పటికీ, ధరాఘాతం కారణంగా వాటిలోని డబ్బు విలువ పెరగడం కష్టమైంది. ఏటేటా ధరలు 6 నుంచి 7 శాతం పెరుగుతుంటే, బ్యాంకులు చెల్లించే వడ్డీ దాదాపు అదే స్థాయిలో ఉండటంతో వాస్తవ వృద్ధి శూన్యానికి చేరుతోంది. అందువల్ల నేటి కాలంలో భద్రతతో పాటు విలువ వృద్ధిని అందించే పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సి ఉంది.
అప్పులకు దూరంగా ఉండాలన్నది మంచి సలహానే. కానీ విద్య, వ్యాపారం లేదా భవిష్యత్ వృద్ధికి ఉపయోగపడే పనుల కోసం సరైన ప్రణాళికతో రుణం తీసుకోవడం తెలివైన నిర్ణయం కావచ్చు. స్టాక్ మార్కెట్ ప్రమాదకరమన్న భయం ఎక్కువగా సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టినవారి అనుభవాల వల్లే. నిపుణుల సలహాతో, దీర్ఘకాలిక వ్యూహంతో ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచి ప్రతిఫలాలను అందించగలదు.
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కలే అయినా, పెరిగిన ఆస్తి ధరల నేపథ్యంలో అద్దె ఇల్లు కూడా ఒక సరైన ప్రత్యామ్నాయం. బీమాను పెట్టుబడిగా కాకుండా భద్రతా సాధనంగా మాత్రమే చూడాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం ఆదా చేయడాన్ని ఎప్పటికీ వాయిదా వేయకూడదు. ఖర్చులు తగ్గించడం మాత్రమే కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం, ఆదా చేసిన సొమ్మును తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారానే భవిష్యత్ ఆర్థిక భద్రత, సంపద వృద్ధి సాధ్యమవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!