

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు వరుస షాక్‌లు ఇస్తోంది. విడతలవారీగా ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ లేఆఫ్స్ ప్రక్రియను కొనసాగిస్తోంది. మొత్తం 30 వేల ఉద్యోగాలను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకెళ్తోందన్న ప్రచారం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గతేడాది అమెజాన్ 14 వేలకుపైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కూడా సుమారు 15 వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత అక్టోబర్‌లో అమెజాన్ ఏకంగా 14 వేల వైట్-కాలర్ ఉద్యోగాలను తొలగించిందని రాయిటర్స్ నివేదించింది.
ఇక ఈ ఏడాది కూడా మరో 14 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలపై పడనుందని తెలుస్తోంది. ఈ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. అయితే, అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి లేఆఫ్స్ ప్లాన్‌లో మార్పులు చేయవచ్చని సంస్థకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ఇటీవల జరిగిన సమావేశంలో స్పందిస్తూ, ‘ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగాలు తొలగించడం లేదు. అలాగే ఏఐ కారణంగానూ కాదు. ఇది కంపెనీ సంప్రదాయంలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమే. ప్రతి ఏడాది కొత్త ఉద్యోగులను నియమిస్తూనే ఉంటాం. ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లేఆఫ్స్ అనివార్యమవుతాయి’ అని తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గత 30 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 2022లో అమెజాన్ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది 10 వేలకుపైగా ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తూనే ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!