

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సిమ్-బైండింగ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం శాఖ (డాట్) ఈ నిబంధనల అమలుకు 2026 డిసెంబర్ 31ను గడువుగా నిర్ణయించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటి ప్రకారం, వినియోగదారులు తమ ఖాతాను నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ కార్డును ఆ యాప్ ఉపయోగిస్తున్న పరికరంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సిమ్ కార్డును తొలగించినా లేదా డీయాక్టివేట్ చేసినా, అవసరమైన సిమ్ మళ్లీ అందుబాటులోకి వచ్చే వరకు ఆ పరికరంలో యాప్ సేవలకు అంతరాయం కలగవచ్చు. రిజిస్టర్డ్ సిమ్ లేకుండానే మెసేజింగ్ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకూ ఈ నిబంధనలు వర్తించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
కొత్త నిబంధనల వల్ల తరచూ సిమ్ కార్డులు మార్చేవారు, కేవలం వై-ఫై ద్వారా పనిచేసే పరికరాల్లో మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించేవారు, ఒకే ఖాతాను పలు పరికరాల్లో వినియోగించేవారు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్లకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేసినట్లు సమాచారం. గతంలో ప్రతీ ఆరు గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్అవుట్ చేయాలనే ప్రతిపాదనను మార్చి, అనుమానాస్పద మోసాల పరిస్థితుల్లో సెషన్‌ను నిలిపివేసేలా రిస్క్ ఆధారిత విధానాన్ని తీసుకొచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో వాట్సాప్ వెబ్, టెలిగ్రామ్ డెస్క్‌టాప్ వినియోగదారులు ప్రతీ ఆరు గంటలకు తప్పనిసరిగా లాగ్అవుట్ అవుతారని భావించాల్సిన అవసరం లేదు. టెలికాం భద్రతను బలోపేతం చేయడం, ఫిషింగ్, నకిలీ గుర్తింపులతో జరిగే మోసాలను తగ్గించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వినియోగదారులపై వాస్తవ ప్రభావం ఆయా సంస్థలు ఈ నిబంధనలను ఎలా అమలు చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!