

ఇండిగో రూపొందించిన నాన్‌స్టాప్ అంతర్జాతీయ సర్వీసుల ప్రణాళిక ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ఒకే సారి ఇంధనం నింపితే 11 గంటలపాటు, 8,700 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించే సరికొత్త ఎయిర్‌బస్ A321 XLR విమానం సంస్థ ఫ్లీట్‌లో చేరింది. దేశీయ విమానయాన సంస్థల్లో ఈ మోడల్‌ను పొందిన తొలి ఎయిర్‌లైన్‌గా ఇండిగో నిలిచింది. ఈ విమానంలో 12 బిజినెస్ క్లాస్, 183 ఎకానమీ సీట్లు ఉండగా, ఈ తరహా 40 విమానాలకు ఇండిగో ఆర్డర్ పెట్టింది. ఇందులో డిసెంబర్ నాటికి మొత్తం 9 విమానాలు డెలివరీ అయ్యే అవకాశముంది.
ఈ నెల 23 నుంచి ముంబయి – గ్రీస్ రాజధాని ఏథెన్స్ మార్గంలో ఈ విమానంతో నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభించనుంది. దీని ద్వారా ఇండిగో లాంగ్ రేంజ్ నారో బాడీ విమాన కార్యకలాపాలకు శ్రీకారం చుడుతోంది. రాబోయే రోజుల్లో అందుకునే A321 XLR విమానాలను ఇస్తాంబుల్, తుర్కియే, డెన్పాసార్, బాలి తదితర అంతర్జాతీయ మార్గాల్లో వినియోగించనుంది. యూరప్, తూర్పు ఆసియా నగరాలకు విస్తరణ లక్ష్యంగా ఈ విమానాలను ఉపయోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ విమానాలు అధిక ఇంధన సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ప్రస్తుతం ఇండిగో వద్ద 400 కు పైగా విమానాలు ఉన్నాయి. ఎయిర్‌బస్ వెబ్సైట్ ప్రకారం, ఈ మోడల్ విమానాలు ప్రస్తుతం పారిస్, కౌలాలంపూర్, డాలస్ మార్గాల్లో మాత్రమే వినియోగంలో ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!