

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నవంబర్‌లో పెరిగే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్‌లోనే ధరలు పెరగవచ్చని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ముఖ్య ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మన్ ప్రసాద్ విశ్లేషించారు. గత మేలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ధరల పెంపులో సగం మేరకు మరోసారి పెరుగుదల ఉండవచ్చని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మేలో ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
తాజా అంచనాల ప్రకారం, ధరల పెరుగుదలతో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి, 2027 జనవరి–మార్చి త్రైమాసికంలో 6.5 శాతానికి చేరవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన 2–6 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ అక్టోబర్–డిసెంబర్‌కు 6 శాతం, జనవరి–మార్చికి 5.7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి ఇది 5.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, మార్చిలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి చేరవచ్చని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!