

2024 అక్టోబరు నుంచి 2026 అక్టోబరు వరకు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) 63.60 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు) ఉపసంహరించుకున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో అంతకుముందు తొమ్మిదేళ్లలో వారు చేసిన నికర పెట్టుబడులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. 2015 అక్టోబరు నుంచి 2024 అక్టోబరు మధ్య భారత షేర్లలో ఎఫ్‌ఐఐలు నికరంగా 63.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. అయితే, ఇటీవలి నెలల్లో కొనసాగిన అమ్మకాలతో 2015 అక్టోబరు నుంచి లెక్కించిన వారి నికర పెట్టుబడుల విలువ మైనస్ 110 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,045 కోట్లు) పడిపోయినట్లు సమాచారం. ఈ లెక్కలు పెట్టుబడుల కొనుగోళ్లు, విక్రయాల మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే సూచిస్తాయి. పెట్టుబడులపై వచ్చిన రాబడులను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల విదేశీ మదుపర్లు పూర్తిగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమించారని భావించకూడదు.
అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణామాలు విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల, బలపడుతున్న అమెరికా డాలరు, అమెరికా ప్రభుత్వ బాండ్లపై అధిక ప్రతిఫలాలు వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో విదేశీ మదుపర్లు డాలర్ ఆధారిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడటం భారత షేర్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీయులకు కరెన్సీ పరమైన నష్టాలను పెంచుతోంది. దేశీయ షేర్ల అధిక విలువలు, కంపెనీల ఆదాయ అంచనాలు కూడా వారి పెట్టుబడి నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, మ్యూచువల్ ఫండ్లు సహా దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు పెంచడం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!