

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం దేశ, విదేశీ ఆర్థిక అంశాలు కీలకంగా మారనున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజు యూరోపియన్ మరియు యూఎస్ మార్కెట్లకు సెలవు ఉండటంతో, దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్ల చురుకుదనం కొంత తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో మార్కెట్లలో అధిక ఆటుపోట్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వారం భారత్‌తో పాటు యూఎస్, చైనా కీలక ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా డిసెంబర్ 29 న నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం వృద్ధి నమోదైంది. 30 న ఎన్ఎస్ఈ డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండగా, 31 న నవంబర్ చివరి నాటికి బడ్జెట్ లోటు వివరాలు వెలువడనున్నాయి. కొత్త ఏడాది తొలి రోజున వాహన విక్రయ గణాంకాలు, జనవరి 2 న డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐతో పాటు విదేశీ మారక నిల్వల డేటా విడుదల కానుంది.
అంతర్జాతీయంగా చూస్తే, చైనాకు సంబంధించిన తయారీ మరియు తయారీయేతర పీఎంఐ గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. యూఎస్‌లో తయారీ ఇండెక్స్‌తో పాటు అక్టోబర్ నెల వాణిజ్య ముందస్తు అంచనాలు ప్రకటించనున్నారు. అలాగే ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ డిసెంబర్ 31 న వెలువడనున్నాయి. వారాంతంలో నిరుద్యోగ భృతి దరఖాస్తుల గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు.
కేలండర్ సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల లావాదేవీలు కొంత మందగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియడంతో 2026 జనవరి సిరీస్‌కు రోలోవర్లు కీలకంగా మారనున్నాయి. దీని ప్రభావంతో ఈ వారం కూడా మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని అంచనా.
గత వారం నాలుగు రోజులు ట్రేడింగ్‌కే పరిమితమైన మార్కెట్లు టెక్నికల్ బ్రేక్అవుట్ సాధించినప్పటికీ మధ్యలో ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ చివరికి స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం. బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు పెరిగి 85,041 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 26,042 వద్ద స్థిరపడింది.
సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వారం నిఫ్టీకి 25,800–25,920 పాయింట్ల పరిధిలో మద్దతు లభించే అవకాశం ఉంది. అక్కడి నుంచి బలపడితే 26,450 పాయింట్ల వరకూ ఎగసే వీలుందని అంచనా. స్వల్పకాలంలో 27,000 స్థాయిని తాకే అవకాశాన్ని కూడా నిపుణులు కొట్టిపారేయడం లేదు. అదే విధంగా సెన్సెక్స్‌కు 84,200–84,600 పాయింట్ల వద్ద సపోర్ట్ కనిపించవచ్చని, అక్కడి నుంచి బలపడితే 86,200ను దాటి సమీప కాలంలో 87,000 మైలురాయిని చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!