

వచ్చే క్యాలెండర్ సంవత్సరానికి (2026) సంబంధించి స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ విడుదల చేశాయి. వారాంతాల్లో కాకుండా సంవత్సరం మొత్తమ్మీద పండగలు, ఇతర ప్రధాన రోజుల కారణంగా 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆయా రోజుల్లో ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కాబట్టి ఆయా తేదీల ప్రకారం పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు సూచించాయి. ఆ వివరాలు ఇవీ..
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సెలవు. మళ్లీ మార్చి 3న హోలీ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు పనిచేయవు. మార్చి 25న శ్రీరామ నవమి, మార్చి 31న మహవీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. అంటే మార్చి నెలలో మొత్తం మూడు రోజులు సెలవులు రానున్నాయి.
ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి, మే 1న మహారాష్ట్ర డే, మే 28న బక్రీద్, జూన్ 26న మొహర్రం సందర్భంగా ఆయా రోజుల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు. మళ్లీ సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి, అక్టోబర్ 20న దసరా సందర్భంగా కార్యకలాపాలు ఉండవు. నవంబర్ 10న దీపావళి, 24న గురునానక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. మళ్లీ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
అయితే, మహా శివరాత్రి (ఫిబ్రవరి 15), ఈద్-ఉల్-ఫితర్ (మార్చి 21), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), దీపావళి లక్ష్మీపూజ (నవంబర్ 8) శని, ఆదివారాల్లో వస్తున్నాయి. ఆయా రోజుల్లో స్టాక్ మార్కెట్లకు ఎలానూ సెలవు దినాలే. దీపావళి లక్ష్మీపూజ ఆదివారం కావడంతో అదే రోజు మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. ట్రేడింగ్ సమయాన్ని కొద్దిరోజుల ముందు వెల్లడించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!