

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. న్యూయార్క్ నగరంలో డెలివరీ విభాగానికి చెందిన సుమారు 5,000 మంది కార్మికులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో నగరంలోని 15 గిడ్డంగులను మూసివేయాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మద్దతిస్తున్న డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టంగా మారితే ఈ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కథనాలు సూచిస్తున్నాయి. అయితే, ఉద్యోగ కోతలు, గిడ్డంగుల మూసివేతపై అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు నిర్ధారణ లేదు.
అమెజాన్ తన డెలివరీ సేవల కోసం నేరుగా డ్రైవర్లను నియమించుకోవడానికి బదులుగా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లపై ఆధారపడుతోంది. న్యూయార్క్‌లో ప్రతిపాదించిన డెలివరీ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే, సంస్థ తన డెలివరీ విధానంలో మార్పులు చేయాల్సి రావచ్చని సమాచారం. ప్రస్తుతం సుమారు 40 థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న 5,000 మందికి పైగా డెలివరీ కార్మికులను నేరుగా నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, గిడ్డంగులను మూసివేయడం వంటి చర్యలను అమెజాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమలైతే నగరంలో డెలివరీ సమయాలు పెరగడంతో పాటు సేవల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!