

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రాయిటర్స్ కథనం ప్రకారం, మంగళవారం కంపెనీ తన రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత విధించింది. ఈ నిర్ణయంతో రోబోటిక్స్ యూనిట్‌కు చెందిన సుమారు 100 వైట్ కాలర్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. రోబోట్స్ డిజైన్, ఆటోమేషన్ టెక్నాలజీలు, అలాగే వేర్‌హౌస్‌లలో ఉపయోగించే రవాణా వ్యవస్థల అభివృద్ధి పనుల్లో ఉన్న సిబ్బంది ఈ లేఆఫ్స్‌కు గురైనట్లు సమాచారం.
గత ఏడాది కూడా అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టింది. మొత్తం 30 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించిన కంపెనీ, అక్టోబర్‌లో 14 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో మరో 16 వేల మందిని బయటకు పంపింది. భవిష్యత్తులో కూడా లేఆఫ్స్ కొనసాగవచ్చని సంస్థ ముందుగానే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో 100 మంది ఉద్యోగులను తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ గతంలో స్పందిస్తూ, “ఉద్యోగాల కోత ఆర్థిక సమస్యల వల్ల కాదు. అలాగే కృత్రిమ మేధస్సు (AI) కారణంగానూ కాదు. సంస్థ వ్యవస్థలో భాగంగా ప్రతీ సంవత్సరం కొత్త నియామకాలు జరుగుతాయి. దాంతో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. సమతుల్యత కోసం కొన్నిసార్లు లేఆఫ్స్ తప్పవు” అని వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!